: మూడున్నర కిలోల బంగారంతో దొరికిపోయిన నడవలేని వృద్ధుడు!


బంగారాన్ని ఎలాగైనా స్మగ్లింగ్ చేసి ఇండియాకు తీసుకురావాలన్న ఆలోచనతో కొత్త కొత్త ప్లాన్లను స్మగ్లర్లు వేస్తున్నా, ఎయిర్ పోర్టుల్లోని అధికారుల నిఘా వారికి చెక్ పెడుతూనే ఉంది. తాజాగా, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నడవలేని స్థితిలో వీల్ చైర్లో వస్తున్న ఓ వృద్ధుడి నుంచి రూ. 93 లక్షల విలువైన మూడున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు వచ్చిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వృద్ధుడు ధరించిన షార్ట్స్ లో బంగారాన్ని దాచి తీసుకువచ్చారని కస్టమ్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ గోవింద్ గార్గ్ వెల్లడించారు. 63 సంవత్సరాల ఈ వ్యక్తి పుదుచ్చేరివాసి అని, దుబాయ్ నుంచి వచ్చి, వీల్ చైర్ కావాలని, గ్రీన్ చానల్ ద్వారా బయటకు వెళ్తానని కోరాడని చెప్పారు. అందుకు అంగీకరించిన అధికారులు, బయటకు వెళ్లే సమయంలో తనిఖీలు చేపట్టగా, బంగారు కడ్డీలు బయటపడ్డాయని చెప్పారు. షార్ట్ కు ఉన్న చిన్న చిన్న పాకెట్లలో బంగారాన్ని దాచి, ఆ బరువుకు షార్ట్ జారకుండా ఉండేందుకు నడుము చుట్టూ ఉండే ఎలాస్టిక్ బ్యాండ్ ను తీసేసి, గట్టిగా కట్టుకుని ఉన్నాడని తెలిపారు. ఆపై అతని లగేజీ కోసం కన్వేయర్ బెల్టు వద్ద ఉన్న మరో ప్రయాణికుడిని కూడా అరెస్ట్ చేశామని, ప్రస్తుతం వీరిని విచారిస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News