: మేమేం తినాలో మోదీ చెబితే వినాలా?: నిప్పులు చెరిగిన మమత
భారతీయులు ఏం తినాలన్న విషయాన్ని నరేంద్ర మోదీ సర్కారు చెబుతుండటం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఈ తరహా నిర్ణయాలను అంగీకరించబోదని, వాటిని పాటించాల్సిన అవసరం కూడా లేదని 'పశు వధ నిషేధం'ను ప్రస్తావిస్తూ మమత స్పష్టం చేశారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోరాదని తాను కోరుతున్నట్టు తెలిపారు. ఈ విషయంలో చట్ట పరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలసి రావాలని, మోదీ సర్కారు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడిచేదేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవడం తగదని హితవు పలికారు. కాగా, పశు వధ నిషేధ నిర్ణయంపై కేరళ ప్రభుత్వం సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.