: ఇండియా ఉగ్ర పన్నాగాలను స్వయంగా వివరించిన కులభూషణ్ జాదవ్: పాక్
పాకిస్థాన్ పై భారత్ జరిపించాలనుకున్న ఉగ్రదాడులపై కులభూషణ్ జాదవ్ నుంచి తాము కీలక సమాచారాన్ని రాబట్టామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. భారత గూఢచారి జాదవ్ అత్యంత విలువైన విషయాలు వెల్లడించాడని విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా 'డాన్ న్యూస్'కు వెల్లడించారు. జాదవ్, భారత్ గూఢచారేనని చెప్పడానికి తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని అటార్నీ జనరల్ అష్తర్ ఔసాఫ్ చెప్పిన మరుసటి రోజే విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మరిన్ని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన ఆయన, తమ వద్ద ఉన్న సాక్ష్యాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కులభూషణ్ జాదవ్ పాక్ జైలు నుంచి విడుదల కాబోడని, ఈ విషయంలో భారత కలలు నెరవేరవని పాక్ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల జాదవ్ తమ దేశంలోని ఉగ్రవాద కార్యకలాపాల నిమిత్తం వస్తే, బెలూచ్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని పాక్ చెబుతుండగా, అతడిని ఇరాన్ లో అరెస్ట్ చేసి, పాక్ కు తెచ్చి కోర్టు ముందు నిలిపినట్టు, స్వయంగా ఆ దేశ నిఘా అధికారి ఒకరు వెల్లడించిన విషయం విదితమే. భారత్ మాత్రం అతనో పదవీ విరమణ చేసిన నావికాధికారని, గూఢచారి కాదని చెబుతూ ఐసీజేను ఆశ్రయించింది.