: మిగిలింది సగం కాలిన పాన్ కార్డు, రక్తపు మరకల షూ... యుద్ధ విమానంలోని పైలట్లు సజీవదహనం!
గత వారంలో అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో కుప్పకూలిన భారత వాయుసేన సుఖోయ్-30 యుద్ధ విమానంలోని పైలట్లు సజీవదహనం అయి ఉండవచ్చని అధికారులు నిర్ధారణకు వచ్చేందుకు ఆధారాలు లభించాయి. ఇప్పటికే విమానం శకలాలు, బ్లాక్ బాక్స్ లభించగా, పైలట్ల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సెర్చ్ టీములకు, రక్తపు మరకలున్న ఓ షూ, సగం కాలిన పాన్ కార్డు, వాలెట్ లభించాయి. ఇవి విమానంలోని ఇద్దరు పైలట్లలో ఒకరివని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సెర్చ్ ఆపరేషన్స్ కు విఘాతం కలుగుతోంది. అయినప్పటికీ, పైలట్ల గురించి పూర్తి సమాచారం తెలిసేంత వరకూ సోదాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. తేజ్ పూర్ ఐఏఎఫ్ ఎయిర్ బేస్ నుంచి ఈ నెల 23న సాధారణ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన యుద్ధ విమానం ఆపై కాసేపటికే మాయమైన సంగతి తెలిసిందే.