: యూపీఏ మెడకు మరో ఉచ్చు.. విమానాల కొనుగోలుపై మూడు కేసులు నమోదు చేసిన సీబీఐ


యూపీఏ మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. ఆ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా కోసం కొనుగోలు చేసిన 111 విమానాలకు సంబంధించి తాజాగా సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. రూ.70 వేల కోట్ల విలువైన ఈ డీల్‌లో సరైన పరిశీలన లేకుండానే ముందుకెళ్లడం, ప్రైవేటు విమానయాన సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేలా నిర్ణయం తీసుకోవడంపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అలాగే 2007లో జరిగిన ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థల విలీనంపైనా ప్రాథమిక విచారణ ప్రారంభించింది. విచారణ అనంతరం ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ధారించనుంది.

కాగా, ఎయిరిండియా కోసం పెద్ద ఎత్తున విమానాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయంతో ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడిందన్నది సీబీఐ ఆరోపణ. ప్రశాంత్ భూషణ్ పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులు నమోదు చేసింది. అయితే ఈ మూడు కేసులను పౌరవిమానయాన సంస్థకు చెందిన అధికారులపై నమోదు చేయడం గమనార్హం.

నిజానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలుత ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోసం 28 విమానాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. చివరికి ఎయిరిండియా కోసం 68, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోసం మరో 43 విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. అప్పట్లో కాగ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

  • Loading...

More Telugu News