: ఇదీ ఉత్తరకొరియా తెగువ... మూడు వారాల వ్యవధిలో మూడో క్షిపణి, ఏడాదిలో 12వ క్షిపణి పరీక్ష!
అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తూ, ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా ఉత్తరకొరియా తెగువ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అణుయుద్ధం మంచిది కాదని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ఉత్తరకొరియా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల స్కడ్ తరహా బాలిస్టిక్ క్షిపణిని నిన్న పరీక్షించింది. ఇది జపాన్ సముద్ర జలాల్లో పడింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
అమెరికా, దక్షిణకొరియా, జపాన్ దేశాలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు వైఖరితో ఆ దేశం వారం రోజుల వ్యవధిలో మూడు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఇది ఈ ఏడాదిలో 12వ క్షిపణి పరీక్ష కావడం విశేషం. అమెరికాను రెచ్చగొట్టేందుకే కిమ్ జాంగ్ ఉన్ ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని ఆంక్షలు విధిస్తామని, సైనిక చర్యకు దిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదని, ఉత్తరకొరియాను ఎలా దారికి తేవాలో తమకు తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ దూకుడుగా వెళ్తున్నారు.
ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగాలని ఉన్నప్పటికీ, రష్యా, చైనాల నుంచి ఏ విధమైన సహకారమూ లేకపోవడంతో పాటు వివిధ దేశాలు తటస్థ వైఖరి అవలంబించడం కూడా ట్రంప్ వెనుకడుగు వేయడానికి కారణమని వారు పేర్కొంటున్నారు. అన్నింటికంటే పిచ్చోడి చేతిలో రాయిలా కిమ్ చేతిలో శక్తిమంతమైన ఆయుధాలున్నాయి. తిక్కరేగితే అమెరికాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంతో వేచిచూసే ధోరిణితో ట్రంప్ ముందుకెళ్తున్నారు. మరోవైపు తమ సముద్ర జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంపై జపాన్ మండిపడింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని ఖండించిన జపాన్ ప్రధాని షింజో అబే, మిత్రదేశం అమెరికాతో కలిసి తగిన సమాధానం చెబుతామని చెప్పింది. ఉత్తరకొరియా ప్రవర్తన మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.