: నితిశ్ కుమార్ సమరభేరి.. ఈసారి యుద్ధం బాల్య వివాహాలు, వరకట్నంపైనే!
బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్య నిషేధం విధించిన ముఖ్యమంత్రి ఈసారి బాల్య వివాహాలు, వరకట్న దురాచారంపై సమర భేరి మోగించేందుకు సిద్ధమవుతున్నారు. గాంధీ జయంతి నుంచి బాల్య వివాహాలు, వరకట్న దురాచారంపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు. మహిళల కోరిక మేరకు మద్య నిషేధం విధించిన ముఖ్యమంత్రి ఇటీవల ప్రజలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ‘లోక్ సంవాద్’ సందర్భంగా ఓ మహిళతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మంగళవారం పాట్నాలో నిర్వహించిన మహావీర్ వత్సాలయ కేన్సర్ ఆసుపత్రి 11వ వ్యవస్థాపక దినోత్సంలో పాల్గొన్న నితిశ్ కుమార్ మాట్లాడారు. బాల్యవివాహాలపై ఓ మహిళ జరుపుతున్న ప్రచారం తనకు స్ఫూర్తినిచ్చిందని నితిశ్ పేర్కొన్నారు. 2005లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక దురాచారాలపై యుద్ధంతోపాటు ఆడపిల్లల రక్షణ, నిషేధం, డి-అడిక్షన్, మహిళా సాధికారత వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు వివరించారు. మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటిపైనా దృష్టి సారిస్తామని నితిశ్ పేర్కొన్నారు.