: ఎద్దు తలను నరికినవారిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్... నలుగురిపై సస్పెన్షన్!
పశువధపై దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వంపై పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేరళలో కొందరు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అత్యంత దారుణ రీతిలో నిరసన తెలిపారు. బహిరంగంగా ఓ ఎద్దు తలను నరికి కేంద్ర ప్రభుత్వం పట్ల నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఒక పశువును బహిరంగంగా వధించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దారుణానికి కారణమైన నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేరళ కాంగ్రెస్ ప్రకటించింది. సస్పెన్షన్ కు గురైనవారిలో యువజన కాంగ్రెస్ నేత రెగిల్ మకుట్టీ కూడా ఉన్నారు.