: మహానాడులో మంత్రి నారాయణ: బాధను మనసులోనే దాచుకుని ప్రసంగం


కుమారుడు పోయిన బాధను మనసులోనే దాచుకుని, మహానాడులో కార్యకర్తలకు స్ఫూర్తి నివ్వడమే లక్ష్యంగా ఏపీ మంత్రి పొంగూరు నారాయణ వేదికపై నుంచి ప్రసంగించారు. 'ప్రజా రాజధానిగా అమరావతి' అంటూ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని వివరిస్తూ, ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, అమరావతితో పాటు ఎన్నో ప్రాంతాలను పరిశీలించామని గుర్తు చేసుకున్నారు. అమరావతికి రాజధాని రావడం ఇష్టంలేని విపక్ష నేత నానా బీభత్సం సృష్టించినా, చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో వేలాది మంది తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని, వారికి పేరు పేరునా కృతజ్ఞతలని చెప్పారు.

రాజధాని నగరానికి తుది రూపునిచ్చే డిజైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయని, రాజధాని అంటే, సెక్రటేరియట్, అసెంబ్లీలతో ఆగవని, వచ్చే ఐదారు సంవత్సరాల్లో లక్షలాది మంది నివసించే ప్రజా అమరావతి సిద్ధమవుతుందని చెప్పారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా చంద్రబాబు సాగిస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణ అన్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రానున్నాయని తెలిపారు. ఈ సమయంలో ఆయన ప్రసంగం సుదీర్ఘంగా సాగుతోందని గమనించిన చంద్రబాబు, ప్రసంగాన్ని త్వరగా ముగించాలని కోరారు. టైం అయిపోయిందని, బ్రీఫ్ గా కంప్లీట్ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News