: వంశీ గారు పరిచయం చేసిన 'పెంటమ్మ పెసరట్టు' నాకు చాలా ఇష్టం!: యంగ్ హీరో సుమంత్ అశ్విన్
తనకు పెంటమ్మ పెసరట్టు చాలా ఇష్టమని టాలీవుడ్ యువనటుడు సుమంత్ అశ్విన్ తెలిపాడు. 'ఫ్యాషన్ డిజైనర్: సన్ ఆఫ్ లేడీస్ టైలర్' సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, ఈ సినిమా సెట్స్ లో మర్చిపోలేని అనుభవాలు ఎదురయ్యాయని తెలిపాడు. అంతకంటే మర్చిపోలేని వ్యక్తులు కూడా పరిచయమయ్యారని అన్నాడు. అందులో పెంటమ్మ ఒకరని చెప్పాడు. గోదావరి జిల్లాలో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడు వంశీ 'పెంటమ్మ పెసరట్టు తిను' అంటే, 'అదేంపేరు' అని నవ్వానని అన్నాడు. అయితే ఒకసారి ఆ పెసరట్టు తిన్నానని, అప్పటి నుంచి ఫిదా అయిపోయానని చెప్పాడు.
ఓ చిన్న హోటల్ నడిపే పెంటమ్మ వేసే పెసరట్టు కోసం ఆ ఊర్లో ఆసక్తిగా ఎదురు చూస్తారని తెలిపాడు. ఒకసారి తాను షూటింగ్ స్పాట్ కు ఆలస్యంగా చేరుకున్నానని, క్రమశిక్షణలో స్ట్రిక్ట్ గా ఉండే దర్శకుడు వంశీ ఆ సమయంలో స్పాట్ లో ఉన్నారని, తనకు ఆయన ఎదురు పడితే క్లాస్ పీకుతారని, పనిష్మెంట్ కూడా ఇస్తారని భావించానని అశ్విన్ అన్నాడు. అయితే వంశీగారు పనిష్మెంట్ గా పెంటమ్మ వేసే పెసరట్లు వేడివేడిగా తినాలని అన్నారని, ఆమె పక్కనే కూర్చుని, పెసరట్లు తిన్నానని, అద్భుతంగా ఉన్నాయని సుమంత్ అశ్విన్ చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి కారణం... తమ సినిమా షూటింగ్ అంత అద్భుతంగా జరిగిందని చెప్పడమేనని ఆయన అన్నాడు. సినిమా షూటింగ్ ఎంత ఆహ్లాదకరంగా జరిగిందో సినిమా అంతకంటే అద్భుతంగా వచ్చిందని సుమంత్ చెప్పాడు.