: శివశ్రీ నా కుమార్తె కాదు, ఆమె తల్లి నా భార్య కాదు: మాదంశెట్టి శివకుమార్ సంచలన ప్రకటన
కృష్ణాజిల్లా విజయవాడలో ఇటీవల ‘నాన్నా! నన్ను బతికించు’ అంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో ఆప్ లోడ్ చేసి, మృతి చెందిన సాయి శివశ్రీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో శివశ్రీ తన తండ్రిగా పేర్కొన్న మాదంశెట్టి శివకుమార్ ఈ ఘటనపై తాజాగా సుదీర్ఘ ప్రకటన మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఆయన శివశ్రీ తన కుమార్తె కాదని పేర్కొన్నారు. అలాగే ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ అలియాస్ సుమశ్రీ తన భార్య కాదని తెలిపారు.
అలాగే శివశ్రీ అనారోగ్య కారణంగా మరణించలేదని, సుమశ్రీతో కలిసి మరికొందరు ఆమెను హత్య చేశారని ఆరోపించారు. తన వద్ద అందుకు సాక్ష్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై ఇప్పటికే మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించానని, దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తానని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సుమశ్రీతో ఉంటున్న పోలిన కృష్ణకుమార్ అనే వ్యక్తికి ఆమె మూడో భార్య అని ఆయన పేర్కొన్నారు. చిన్నారి శివశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్ లో అద్దెకు దిగిందని తెలిపారు.
ఆ తరువాత 8 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్ లోని కృష్ణకుమార్ వద్దకు వెళ్లిపోయిందని ఆరోపించిన ఆయన, అప్పట్లో దీనిపై పామర్రు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. కేవలం మానవతా దృక్పథంతోనే పాపను పెంచానని, శివశ్రీ వైద్యానికి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేశానని ఆయన తెలిపారు. మంచి ఆలోచనతోనే సాయం చేశాను తప్ప తనకు వారితో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు శివశ్రీ పేరిట ఉన్న ఫ్లాట్ ను ఆక్రమించారని, విక్రయించకుండా అడ్డుకుంటున్నారని శివశ్రీ, ఆమె తల్లి సుమశ్రీలు ఆరోపించిన ఫ్లాట్ గురించి కూడా ఆయన తన ప్రకటనలో ప్రస్తావించారు. గతంలో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కి, చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ మహిళ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని తన ఫ్లాట్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తన ఫ్లాట్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ, ఆ ఫ్లాట్ చుట్టుపక్కల వారు కంట్రోల్ రూమ్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారని అన్నారు.