: రూ. 7 వేల కోట్ల సంపాదన ఆవిరి... పాతాళానికి టెక్ మహీంద్రా ఈక్విటీ!
ఇండియాలో ఐదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న టెక్ మహీంద్రా ఈక్విటీ ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తరువాత పాతాళానికి పడిపోయింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేక, సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలను సాధించడంలో టెక్ మహీంద్రా విఫలం కాగా, సంస్థ ఈక్విటీ నిమిషాల వ్యవధిలో 17 శాతానికి పైగా పతనమైంది. దీంతో రూ. 7 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. గత శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తరువాత సంస్థ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ, ఆపరేటింగ్ మార్జిన్ 16.7 శాతం నుంచి 12 శాతానికి పడిపోయినట్టు ప్రకటించింది.
నెట్ ప్రాఫిట్ 33 శాతం దిగజారి రూ. 590 కోట్లకు చేరినట్టు తెలిపింది. మార్కెట్ అనలిస్టులు సంస్థ నికర లాభం రూ. 783 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేయగా, దానికి చాలా దూరంలో వాస్తవ గణాంకాలు ఉండటం పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను హరించింది. దీంతో సంస్థ ఈక్విటీలను విక్రయించేందుకు పెద్దఎత్తున ఇన్వెస్టర్లు ప్రయత్నించారు. కాగా, ఈ ఉదయం 11:55 గంటల సమయంలో సంస్థ ఈక్విటీ క్రితం ముగింపుతో పోలిస్తే 10 శాతానికి పైగా నష్టంతో రూ. 385 వద్ద కొనసాగుతుండగా, 1.13 కోట్లకు పైగా వాటాలు చేతులు మారినట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి.