: కకావికలమైన లంక... 164కు పెరిగిన మృతులు
నైరుతి రుతుపవనాల కారణంగా గడచిన వారం రోజులుగా భారీ వర్షాలు శ్రీలంకను కకావికలం చేయగా, ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 164కు పెరిగింది. గత 14 సంవత్సరాల కాలంలో ఎన్నడూ రానంత భారీ వరదలు ద్వీపదేశాన్ని చుట్టు ముట్టగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 200 మందికి పైగా గల్లంతైనట్టు వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో కొట్టుకుపోవడం, మట్టి పెళ్లలు విరిగిపడటం, గోడలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
లంక అభ్యర్థన మేరకు భారత సైన్యం సహాయక సామాగ్రితో నిండిన రెండు నౌకలను కొలంబో పంపింది. ఐక్యరాజ్య సమితి బృందాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇప్పటివరకూ 4 లక్షల మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. వర్షాలు ఇంకా మూడు నాలుగు రోజులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుండటంతో సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి.