: 'ఒక నిమిషానికి 60 సెకన్లు - ఒక సెకనుకు 100 స్టంపింగ్స్'... ధోనీ అద్భుత మ్యాజిక్ పై పొగడ్తల వెల్లువ!
మహేంద్ర సింగ్ ధోనీ... స్టంప్స్ వెనకాల అతనెంతటి శక్తిమంతుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇదే విషయం నిన్న న్యూజిలాండ్ తో చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకంగా జరిగిన మ్యాచ్ లో మరోసారి నిరూపితమైంది. సెకనులో పదో వంతు వ్యవధిలో ధోనీ చేసిన స్టంపింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన వేళ, ఉత్తమ బ్యాట్స్ మెన్ లలో ఒకడిగా, కష్టకాలంలో ఆదుకునే వాడిగా పేరున్న గ్రాండ్ హోమ్మీ క్రీజులోకి వచ్చాడు.
ఆ సమయంలో రవీంద్ర జడేజా బౌలింగ్ కు రాగా, అతనిపై ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో ఓ అడుగు ముందుకు వేసి భారీ షాట్ కు యత్నించి విఫలం అయ్యాడు. వికెట్ల వెనకాలే ఉన్న ధోనీ, బంతిని ఒడిసిపట్టి, స్టంపింగ్ చేసి గ్రాండ్స్ హోమ్మీని అవుట్ చేసిన తీరు చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
'ఒక గంటకు 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకన్లు అయితే, ఒక సెకనుకు 100 ధోనీ స్టంపింగ్స్ జరుగుతాయి' అని ఒకరు, 'స్టంప్స్ వెనుక ధోనీ మెరుపులాంటి వాడు' అని ఇంకొకరు, 'ధోనీ వెనకాల ఉంటే, ఫ్రంట్ ఫుట్ వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి' అని మరొకరు... ఇలా ట్వీట్ల వర్షం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ని వరుణుడు అడ్డుకోగా, డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచినట్టు అంపైర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.