: పలు పార్టీలు నాకు టికెట్ ఇస్తామన్నాయి.. నేను దండం పెట్టేశాను: ఆర్.నారాయణ మూర్తి
తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని గతంలో టీడీపీ మూడుసార్లు కోరిందని, అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇస్తామని చెప్పిందని, మొన్న కూడా ఒక పార్టీ ఆఫర్ ఇచ్చిందని తాను ఓ దండం పెట్టానని సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రాజకీయాల్లోకి వెళితే ప్రజల కోసం 24 గంటలు పనిచేయాలని, లేకపోతే వెళ్లకూడదని అన్నారు. తనకు సినిమా పిచ్చి మాత్రమే ఉందని అన్నారు. రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణించకూడదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ అప్పట్లో ఓ హిస్టరీ క్రియేట్ చేశారని అన్నారు. ఎన్టీఆర్ తరువాత అంతటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మళ్లీ వైఎస్.రాజశేఖర్ రెడ్డని అన్నారు.
తమ ఊరిలో మొదటిసారి బీఏ చదివింది తానేనని ఆర్.నారాయణమూర్తి అన్నారు. తనకు కమ్యూనిజం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని చెప్పారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తనకు ఒక భగవద్గీతలా అనిపించిందని అన్నారు. గద్ధర్, వంగపండు పాటలంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.