: పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో నాకు పెళ్లిచేస్తున్నారు.. నేను చదువుకుంటా!: పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక
ఇది వరకే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తితో తమ 16 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలని చూశారు ఓ తల్లిదండ్రులు. దీంతో ఆ బాలిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని కయేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చింతకుంట తండాకు చెందిన ఆ బాలిక పేరు తులసి. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసింది. పై చదువులు చదువుకుందామని అనుకుంటుండగా తనకు తన తల్లిదండ్రులు కాట్రావత్ లక్ష్మణ్, కాట్రావత్ పట్నిలలు వచ్చేనెల 4వ తేదీన ఓ వ్యక్తితో పెళ్లి చేయడానికి నిర్ణయించారని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది.
రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తిని ఇచ్చి తనకు పెళ్లి చేస్తున్నారని, ఆ వ్యక్తికి ఓ కొడుకు(11), కూతురు (10) ఉన్నారని, వారిని చూసుకునేందుకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపింది. ఫిర్యాదు సేకరించిన పోలీసులు తులసి తల్లిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి, తులసిని మహబూబ్‌నగర్ స్టేట్‌హోమ్‌కు తరలించారు. ఆ బాలికకు అక్కడే కాలేజిలో అడ్మిషన్ ఇప్పించనున్నట్లు చెప్పారు.