: ప్రస్తుతం సెటైర్ల పేరిట బూతు ప్రోగ్రాముల్ని చేస్తున్నారు!: సినీ నటి కవిత
జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ పలు డైలాగులు చిన్నపిల్లలు, ఆడవారు కూర్చొని వినడానికి వీలులేని విధంగా ఉంటున్నాయని సినీ నటి కవిత అన్నారు. మహిళల పట్ల పలువురు చేస్తోన్న వెకిలి వ్యాఖ్యల పట్ల, టీవీ కామెడీ ప్రోగ్రాంలలో సెటైర్ల పేరిట మహిళలపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాము ఒక రోజు ఒక ఆడియో ఫంక్షన్‌కి వెళ్లామని, జబర్దస్త్ వారు వేదికపై కామెడీ ప్రోగ్రాం వేశారని ఆమె చెప్పారు. వారు చెప్పే డైలాగులకి ఎంతో మంది విజిల్స్ వేస్తున్నారని చెప్పారు. జబర్దస్త్‌లో ఇటువంటి బూతు డైలాగులు వేస్తారని తనకు అప్పుడే తెలిసిందని అన్నారు.
అక్కడ వెయ్యిమంది ఉంటే 998 మంది ఎంజాయ్ చేస్తున్నారని, కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇబ్బంది పడ్డారని ఆమె చెప్పారు. అనంతరం తాను ఓ జబర్దస్త్ నటుడితో ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు వేస్తారని అడిగితే... 'చూసేవారు హ్యాపీగానే చూస్తున్నారు.. ప్రసారం చేసేవారు హ్యాపీగానే చేస్తున్నారు' అని సమాధానం చెప్పారని కవిత అన్నారు. పైగా, ప్రోగ్రాం ఇష్టలేకపోతే ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా? అని అన్నారని చెప్పారు. టీవీల్లో ఆరోగ్యకరమైన కామెడీని, అంటే బూతులు లేకుండా వచ్చే కామెడీని మాత్రమే ప్రసారం చేస్తే బాగుంటుందని కవిత అన్నారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో కామెడీ ప్రోగ్రాంలు చూస్తున్నామని, హాయిగా నవ్వుకుంటున్నామని, ప్రస్తుతం మాత్రం సెటైర్ల పేరిట బూతు ప్రోగ్రాంలను చేస్తున్నారని ఆమె విమర్శించారు.