: బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు వాయుగుండంగా మారే అవకాశం... చల్లబడ్డ వాతావరణం
పశ్చిమ మధ్య, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయంలోగా వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వాతావరణం చల్లబడిందని, దక్షిణాది రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం నుంచి కొంత ఊరట లభించనుందని తెలిపిన అధికారులు, నైరుతి రుతు పవనాలు నెలాఖరులోగా మాల్దీవులు, దక్షిణ కేరళను తాకుతాయని అంచనా వేశారు. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి బలంగా ఉన్నందున నేడు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని, ఆపై రుతుపవనాల ప్రభావంతోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.