: స్వాతిది కూడా హత్యేనా?...: 'భువనగిరి ప్రేమకథ'లో కొత్త అనుమానాలు!
భువనగిరి జిల్లాకు చెందిన స్వాతి, నరేష్ ల ప్రేమకథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. దర్యాప్తులో నరేష్ ను అత్యంత పాశవికంగా స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే నరికి చంపగా, అతనికి ఆమె సోదరుడు, డ్రైవర్ సత్తిరెడ్డి సహకరించినట్టు తేలింది. అనంతరం ఆధారాలు లేకుండా స్వాతి పేరిట ఉన్న పొలంలోనే ఈ మృతదేహాన్ని దహనం చేసేసి, అస్థికలను మూసీ నదిలో కలిపేశారు. ఈ నెల 2 రాత్రి ఈ ఘటన జరగగా, ఈ నెల 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై స్వాతి తల్లిదండ్రులు, ఇతర బంధువులు కూడా కన్నీరుమున్నీరయ్యారు. ప్రేమ ఎంతపని చేసిందంటూ బాధపడ్డారు.
అయితే ఇప్పుడు నరేష్ ది హత్య అని తేలిన నేపథ్యంలో స్వాతిది హత్యా? ఆత్మహత్యా? అన్న అనుమానం రేగుతోంది. స్వాతి ఆత్మహత్య చేసుకున్న రోజునే... ఆ వార్తను కవర్ చేసిన మీడియా సంస్థలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. స్వాతి సెల్ఫీ వాంగ్మూలం అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ, స్వాతి ఆత్మహత్య చేసుకుందన్న ప్రదేశంలో ఆత్మహత్య చేసుకోవడం సాధ్యం కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నరేష్ హత్య వెలుగు చూడడంతో స్థానికులు స్వాతిది కూడా హత్యే అయివుండచ్చని, నరేష్ హత్య గురించి ఆమెకు తెలిసి గొడవ చేసి ఉంటుందని, దాంతో ఆమెను కూడా హత్య చేసి ఉండచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులు ఈ విషయంపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.