: బుర్హాన్ వనీ వారసుడిని కాల్చి చంపిన సైన్యం.. రెండు ఎన్ కౌంటర్లలో 8 మంది హతం
జమ్ముకశ్మీర్ లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఉదయం భారత సైన్యం ఎన్ కౌంటర్లను చేపట్టింది. రాంపూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును సైన్యం భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు ఉగ్రవాదులను హతం చేసింది. మరి కొందరు ఉగ్రవాదులు తప్పించుకొని ఉండవచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని సైనికులు జల్లెడ పడుతున్నారు. ఘటనా స్థలంలో ఏకే47 తుపాకులు, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. సోయ్ మోహ్ గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులు దాక్కున్నారన్న అనుమానంతో భద్రతాదళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని గుర్తించిన సైనికులు... వారిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వీరిలో హిజ్బుల్ కమాండర్ సబ్జార్ భట్ ఉన్నాడు. గత ఏడాది హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా సిబ్బంది హతమార్చిన తర్వాత... అతని స్థానంలో సబ్జార్ భట్ వచ్చాడు.