: ‘విశాఖ’ వేదికగా నేటి నుంచి మహానాడు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
విశాఖపట్టణం వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ 36వ మహానాడు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహానాడుకు సర్వం సిద్ధం చేశారు. పదిహేనేళ్ల తర్వాత మహానాడుకు విశాఖపట్టణం వేదిక కావడం గమనార్హం. రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 16, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలపైన, విభజన చట్టం, హామీల అమలుపైన చర్చ జరగనుంది. కార్యకర్తల సమగ్రాభివృద్ధిపై నేతలకు పిలుపు ఇవ్వనున్నారు.
టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహం పురికొల్పడమే లక్ష్యంగా మహానాడును ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయతి. నేటి మహానాడుకు 17 వేల మంది ప్రతినిధులు, మరో తొమ్మిది వేల మందికి పైగా కార్యకర్తలు హాజరుకానున్నట్టు సమాచారం. మహానాడు నిర్వహణకు 14 కమిటీలు పని చేస్తున్నాయి. 250 మంది కూర్చునేందుకు అనువుగా మహానాడు ప్రధాన వేదికను, 25 వేల మంది ప్రతినిధులు కూర్చునేందుకుగా వీలుగా సమావేశ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మహానాడుకు తరలివచ్చే వాహనాలకు 12 ఎకరాల్లో పార్కింగ్ స్థలం కేటాయించారు. 3,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు సమాచారం.