: రేపు నరేంద్ర మోదీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ
రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్ష పార్టీల అధినేతలు ఇప్పటికే చర్చలు జరిపినప్పటికీ వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయం తెలిసిందే. మరోవైపు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన విందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ హాజరుకాలేదు. దీంతో ఆయన విపక్షపార్టీలు నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపబోరనే అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నితీశ్ కుమార్ రేపు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆయన బీహార్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్డీఏ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థిపై కూడా చర్చించి మద్దతు పలుకుతారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీహార్‌లో తమ మిత్రపక్షమైన ఆర్జేడీతో ప్రస్తుతం నితీశ్‌కు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై పలు అవినీతి ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో నితీశ్‌కుమార్ ఆర్జేడీ నేతల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.