: భారత్ లో ‘ఉగ్ర’ దాడులకు లష్కరే తోయిబా కుట్ర!
భారత్ లోకి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దేశంలోకి చొరబడ్డ 21 మంది ఉగ్రవాదులు భారీ ఎత్తున దాడులకు పథక రచన చేసినట్టు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న యాంటీ టెర్రర్ యూనిట్లకు ఇంటెలిజెన్స్ శాఖ సమాచారాన్ని చేరవేసింది. పాక్ కు చెందిన ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించినట్టు ఓ వార్తా పత్రిక పేర్కొంది. కాగా, దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో కొందరు ముంబై, ఢిల్లీలోకి, మరికొందరు పంజాబ్, రాజస్థాన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.