: 'దేవుడి' ప్రసాదాన్ని ఆస్వాదించకుండా.. భార్యతో గడపాల్సి వచ్చింది: సెహ్వాగ్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్ 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, అందరి మన్ననలు అందుకుంటోంది. క్రికెటర్ల కోసం ఈ సినిమాను బుధవారం నాడు ముంబైలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే ఈ ప్రీమియర్ కు సచిన్ కు అత్యంత ఇష్టమైన ఓ వ్యక్తి రాలేదు. అతనే టీమిండియా డ్యాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
సచిన్ ను దేవుడు, గురువు అని సంబోధించే సెహ్వాగ్ ఈ ప్రీమియర్ కు ఎందుకు రాలేదో ఓ వీడియో ద్వారా తెలిపాడు. "ప్రీమియర్ కు నాకు ఆహ్వానం అందింది. అయితే ఇదే సమయంలో నేను నా భార్యతో హాలిడే ట్రిప్ లో ఉన్నా. దేవుడి ప్రసాదాన్ని ఆస్వాదించకుండా... భార్య ఆర్తితో గడపాల్సి వచ్చింది" అని తెలిపాడు. డ్రెస్సింగ్ రూములో ఉన్నప్పుడు, నాన్ స్ట్రైకర్ గా క్రీజులో ఉన్నప్పుడు సచిన్ ను ఫ్రీగా చూశానని... ఇప్పుడు సచిన్ బ్యాటింగ్ చూసేందుకు డబ్బును, సమయాన్ని ఖర్చు చేస్తానని చెప్పాడు. ఈ సినిమా ద్వారా ఎంతో మందిలో సచిన్ స్ఫూర్తిని నింపుతాడని తెలిపాడు.