: ట్రంప్ విజయ రహస్యం అదే: ఛార్లస్ క్రాతమార్
తనను కాదన్న వారిని తన వైపు తిప్పుకోగలగడమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయ రహస్యం అని అమెరికా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఛార్లెస్ క్రాతమార్ అన్నారు. ఈ మేరకు ఆయన వాషింగ్టన్ లో మాట్లాడుతూ, అమెరికాలో ట్రంప్ శకం మొదలైందని అభిప్రాయపడ్డారు. అందుకు నిదర్శనమే ఆయన విదేశీ పర్యటనలని ఆయన చెప్పారు. ఆయన పర్యటనలను ఓసారి గమనిస్తే... ట్రావెల్ బ్యాన్ ను ముస్లిం దేశాలపై విధించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ముస్లింలలో సున్నీలు అధికంగా గల సౌదీఅరేబియాలో పర్యటించారు. తద్వారా ముస్లింలకు తాను వ్యతిరేకం కాదనే సందేశం పంపారు.
దీంతో ఇప్పుడు 50 దేశాల్లో విస్తరించిన సున్నీ శాఖల ప్రజలంతా తమకు అనుకూలమేనని ఆయన అన్నారు. అనంతరం, తనను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఇజ్రాయెల్ లో పర్యటించడం ద్వారా జూడాయిజంకు అనుకూలమనే సందేశం పంపారని ఆయన చెప్పారు. అనంతరం వాటికన్ సిటీలో పర్యటించడం ద్వారా పోప్ ఫ్రాన్సిస్ ను కలవడం ద్వారా క్రైస్తవం పట్ల తనకు ఆరాధనాభావం ఉందని చాటారని ఆయన అన్నారు. దీంతో ట్రంప్ తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు.