: టీడీపీలో చేరండి... మహానాడులో మాట్లాడండి: కొణతాలకు బంపరాఫర్!
ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరాలని, ఆయన రాకను చంద్రబాబునాయుడు సైతం ఆహ్వానిస్తారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. మహానాడులో తనకు అవకాశం ఇస్తే, ఇక్కడి సమస్యలపై మాట్లాడతానని కొణతాల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, తెలుగుదేశంలో చేరితే, మహానాడులో ప్రసంగించే అవకాశాన్ని ఇస్తామని అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వేళ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో ఆయన చెప్పాలని అన్నారు.
ఉత్తరాంధ్ర సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న కొద్దిమంది నేతల్లో కొణతాల రామకృష్ణ కూడా ఒకరని, మిగతా వారికంటే సౌమ్యుడని కొనియాడిన అయ్యన్నపాత్రుడు, ఆయన్ను టీడీపీలో చేర్చుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి, అభివృద్ధి దిశగా ఆయన సలహాలు ఇస్తే, తాము పరిగణనలోకి తీసుకుంటామని, నేడు పార్టీలో చేరితే, రేపటి నుంచి జరిగే మహానాడులో ఆయన మాట్లాడవచ్చని అన్నారు.