: ప్రియుడి కోసం భర్త, పిల్లల్ని వదిలేసిన మహిళ... చివరికి దొంగగా మారింది!
సంతోషం కోసం భర్త, పిల్లల్ని వదిలేసింది. జల్సాల కోసం ఆత్మగౌరవాన్ని వదిలేసింది. హైదరాబాద్, చాదర్ ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ కు చెందిన కె.పద్మ (29) కు పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో ఆమె ముగ్గురు పిల్లల తల్లిగా మారింది. వివాహమైనా మునుపటి సరదాలు, షికార్లు ఆమెకు పోలేదు. దీంతో రెండు సార్లు భర్తను వదిలేసి వెళ్లిపోయింది. అయినప్పటికీ భర్త ఆమెను క్షమించి, ఇంటికి తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళకు అదే ప్రాంతంలో ఉండే కె.పవన్ కుమార్ (23) తో పరిచయం పెంచుకుంది. దీంతో మూడోసారి కూడా భర్త, పిల్లలను వదిలేసి ఇల్లుదాటింది. ఈ సారి ఆమె భర్త ఆమె కోసం ప్రయత్నించడం వేస్ట్ అని భావించి వదిలేశాడు.
దిల్ షుక్ నగర్, గడ్డి అన్నారంలోని ప్రగతి ఉమెన్స్ హాస్టల్ లో స్టూడెంట్ అని చెప్పి ఆమెను చేర్పించాడు. కొన్నాళ్లకు భర్త నుంచి వచ్చేసేటప్పుడు తెచ్చుకున్న 40,000 రూపాయలు ఖర్చైపోయాయి. దీంతో ప్రియుడి సలహాతో హాస్టల్ ఫీజు చెల్లించేందుకు, ఇతర అవసరాలు (జల్సాలు) తీర్చుకునేందుకు డబ్బు కోసం దొంగగా మారింది. హాస్టల్ లో ఇతరులను గమనిస్తూ, తోటి విద్యార్థినుల సెల్ ఫోన్లు, బంగారు గొలుసులు చోరీ చేయడం మొదలు పెట్టింది. బాధితులు, హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో నిఘా ఉంచిన పోలీసులు, సెల్ చోరీ చేస్తుండగా పద్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణలో ప్రియుడు పవన్ కుమార్ సూచనతోనే దొంగతనం చేస్తున్నట్టు తెలిపింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, ఆరు గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.