: థియేటర్ యాజమాన్యానికి 'వేడుక' చూపించి మెడలు వంచిన అక్కినేని అభిమానులు!
అక్కినేని కుటుంబ నట వారసుడు నాగచైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఈ ఉదయం విడుదల కాగా, నిర్ణయించిన రేటు కంటే, అధికంగా టికెట్లను అమ్ముతున్న ఓ థియేటరు యాజమాన్యానికి ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. చిత్ర ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడమే కాకుండా, తాము అదనంగా చెల్లించిన డబ్బును వెనక్కు తెచ్చుకున్నారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.
నగరంలోని శాంతి, గౌరి థియేటర్లలో మాత్రమే ఈ చిత్రం విడుదలకు అనుమతి వుంది. అయితే డిస్ట్రిబ్యూటర్లతో కుమ్మక్కైన ఎస్వీ థియేటర్ కూడా ఈ చిత్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసేందుకు సిద్ధమైంది. మిగతా థియేటర్లలో టికెట్ కు రూ. 100 వసూలు చేస్తుంటే, ఎస్వీ యాజమాన్యం రూ. 150 నుంచి రూ. 170 వసూలు చేసింది. విషయం తెలుసుకున్న పలువురు నాగార్జున ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. విషయాన్ని ఆర్డీవో, ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. నిరసనల ఉద్ధృతి పెరగడంతో దిగివచ్చిన సినిమా థియేటర్ యాజమాన్యం, తాము షో వేయలేమని చెబుతూ, డబ్బు వెనక్కు ఇచ్చింది.