: ఉత్తర కొరియాతో చర్చలకు చాలా తక్కువ సమయమే మిత్రమా... చైనాను హెచ్చరించిన అమెరికా!

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని, అణ్వస్త్ర ప్రయోగాలను చర్చల ద్వారా అడ్డుకునేందుకు చైనాకు అతి కొద్ది సమయమే మిగిలివుందని అమెరికా హెచ్చరించింది. బీజింగ్ లో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఈస్ట్ ఆసియన్ అండ్ పరిఫిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ సుసాన్ థ్రాంటన్, ఉత్తర కొరియా సమస్యను చాలా త్వరతిగతిని పరిష్కరించాల్సి వుందని అన్నారు. అందుకు సమయం కూడా తక్కువగానే ఉందని, ఈలోగానే కొరియా నేతతో మాట్లాడి, అతని దూకుడుకు కళ్లెం వేయాలని సూచించారు.
"తమకు సమయం తక్కువగానే ఉందన్న సంగతి చైనాకు తెలుసుననే అనుకుంటాను. నార్త్ కొరియన్లను చర్చలకు పిలిచి మాట్లాడాల్సిన సమయం ఇదే. చాలా త్వరగా ఇది జరగాలి" అని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో డజనుకు పైగా క్షిపణి పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించిన సంగతి తెలిసిందే. తదుపరి ఇదే తరహాలో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు కిమ్ జాంగ్ ఉన్ సైన్యం ఉత్సాహంతో ఉండగా, వారిని అడ్డుకోవాలని అమెరికా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.