: పక్కా ప్రణాళికతోనే ఇంత హింస... ఎవరినీ వదిలిపెట్టబోను: యూపీ సీఎం తీవ్ర హెచ్చరిక
యూపీలోని షహరాన్ పూర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పక్కా ప్రణాళిక ఉందని, ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడటానికి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీయే కారణమని ఆరోపించారు. ఈ హింస వెనుక బీఎస్పీ వారున్నారని, పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని తెలిపారు. జిల్లాకు కొత్త అధికారులను నియమించామని పేర్కొన్నారు.
కాగా, దళితులు, ఠాకూర్ల మధ్య గొడవలు జరిగిన షబీర్ పూర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు మాయావతికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దళితులపై జరిగిన దాడులు, ఆపై జరిగిన విధ్వంసంలో ఇద్దరు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు, పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా దళితులు, అగ్రవర్ణాల మధ్య గొడవలు జరుగుతున్నాయని, పరిస్థితిని సమూలంగా మార్చాలని సంకల్పించామని హోం శాఖ కార్యదర్శి మణి ప్రసాద్ మిశ్రా తెలిపారు. స్థానిక దళిత సంస్థ భీమ్ సేనకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ ఈ గొడవల వెనుక ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు. పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు నాలుగు కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను మోహరించామని తెలిపారు.