: ‘ఈవీఎం చాలెంజ్’లో ‘ఆప్’ కొత్త పల్లవి.. మదర్‌బోర్డు హ్యాక్‌కు అనుమతించాలని వేడుకోలు!
ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ గగ్గోలు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో స్పందించిన ఈసీ ఈవీఎంలు ట్యాంపరింగ్ కావని, దమ్ముంటే నిరూపించాలంటూ ఓపెన్ చాలెంజ్ విసిరుతూ డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఈ సవాలు నుంచి ఇప్పటికే కాంగ్రెస్ వెనక్కి తగ్గగా.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పల్లవి అందుకుంది.
ఈవీఎంలను ఏ రకంగా అయినా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఇవ్వాలని కోరింది. గురువారం ఎన్నికల సంఘాన్ని కలిసిన ఆప్ ప్రతినిధులు ఈవీఎంలోని మదర్‌బోర్డును ట్యాంపర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే వారి విన్నపాన్ని ఈసీ నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. అలా చేయడం వల్ల ఈవీఎంలు తమ సహజత్వాన్ని కోల్పోతాయని తేల్చి చెప్పింది. జూన్ 3న జరగనున్న ఈవీఎం ట్యాంపరింగ్ చాలెంజ్‌కు దేశంలోని 7 జాతీయ పార్టీలు, 48 ప్రాంతీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది.