: అందమైన అమ్మాయి రోడ్డుపై నిలబడి హాయ్ చెబుతుంది... ఇక ఆమె ఓరచూపులకి పడ్డారా... ఇక నిలువు దోపిడీనే!
బెంగళూరు రోడ్డు మీద రాత్రుళ్లు ఓ అందమైన యువతి కనపడుతుంది.. వాహనాలపై వెళుతున్న వారంతా ఒంటరిగా నిలబడ్డ ఆమెనే చూస్తూ వెళతారు. ఇంతలో ఆమె కారు లేదా బైక్ పై వెళుతున్న యువకుడికి హాయ్ అంటూ సైగలు చేస్తుంది. అందమైన అమ్మాయి ఏకంగా ఇంత చీకట్లో హాయ్ చెబుతోందని, లక్కు కలిసివచ్చిందని యువకులు ఆమె వద్దకు వెళతారు. ఆమె ఎన్నో మాయమాటలు చెప్పి ఒక చోటుకి తీసుకెళుతుంది. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న కొందరు ఇక ఆ యువకుడిని చితక్కొట్టి, అతడి జేబులో ఉన్న డబ్బు, సెల్‌ఫోన్, ఒంటిపై ఉండే నగలు, బైక్‌ను తీసుకొని పారిపోతారు...
పక్కా ప్లాన్ తో కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిని ఎరగా వేసి డబ్బంతా కాజేస్తున్నారు. మోసపోయిన కొందరు యువకులు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు పోలీసులు ఇటీవల పథకం పన్ని రాత్రి 10.30 గంటల సమయంలో మాటువేసి ఆ గ్యాంగ్‌ను పట్టుకొని పలు వివరాలు తెలిపారు. కర్ణాటక బేగూరులోని ఏకే కాలనీకి చెందిన మోనిషా , పునీత్, ముత్తు , తులసీరాం , అరుణ్ యశ్‌రాజ్ , విఘ్నేష్, స్టీఫెన్, బబ్లూ, అలెక్స్, అమర్ అనే యువత ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు కత్తులు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమకు మోనిషా, పునీత్, ముత్తు, తులసీరాం, అరుణ్ యశ్‌రాజ్ చిక్కారని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని అన్నారు.