: ఆంధ్రప్రదేశ్లో బీజేపీని శక్తిమంతమైన పార్టీగా తయారుచేయాలి: వెంకయ్య నాయుడి పిలుపు
ఆంధ్రప్రదేశ్లో బీజేపీని శక్తిమంతమైన పార్టీగా తయారుచేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనం జరిగింది. ఇందులో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ... మోదీ సుపరిపాలనకు మారుపేరని అన్నారు. దేశం మొత్తం బీజేపీ, మోదీ వైపే చూస్తోందని చెప్పారు. బీజేపీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అన్నారు. మరో నాలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలలో భాగస్వామ్యంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 'ఇందుగలడందు లేడని సందేహం వలదు' అన్నట్లు అవినీతి పరులు తయారయ్యారని చెప్పారు.
మోదీ పాలనలో అవినీతికి తావులేదని వెంకయ్య నాయుడు చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా పలువురు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ మైనారిటీ ప్రజలకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్న పార్టీ బీజేపీయే అని అన్నారు. మోదీ పాలన మరో పదేళ్లు కొనసాగాలని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 360 స్థానాలకు పైగా వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. భారత్లో అన్ని వనరులు ఉన్నాయి.. కానీ, ఇన్నాళ్లూ సరైన ప్రభుత్వం లేక ఇంకా కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నామని అన్నారు. కశ్మీర్ సమస్య ఇంకా రావణకాష్టంలా కాలుతూనే ఉందంటే దానికి కారణం కాంగ్రెసే అని చెప్పారు.
భారత మాతకు జై అంటే దేశంలోని ప్రజలందరికీ మేలు జరగాలని అర్థం అని వెంకయ్య చెప్పారు. కులం, మతం, వర్గం పేరుతో కాంగ్రెస్ పరిపాలన చేసిందని అన్నారు. మోదీ అంటే డెవలప్ మెంట్ , సమగ్రత, సుపరిపాలన, పేదరిక నిర్మూలన అని అభివర్ణించారు. అవినీతి పరులకు మోదీ భయంకరుడని అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం మోదీ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా తమ పార్టీ విస్తరిస్తోంటే, మరోవైపు ఇతర పార్టీల్లో చీలికలు వస్తున్నాయని అన్నారు. బీజేపీని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. బీజేపీ విధానాలు అంతటి మహత్తరంగా ఉన్నాయని అన్నారు.