: ముగ్గురు పాకిస్థానీయుల అరెస్టు.. ప్రేమ జంటను కలిపేందుకు వచ్చామన్న నిందితులు
నకిలీ పాస్‌పోర్టు, ఆధార్‌కార్డులతో భారత్‌లోకి ప్రవేశించిన ముగ్గురు పాకిస్థానీయులను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా బెంగళూరులో ఉంటున్నారని, వారితో పాటు ఉంటున్న కేరళకు చెందిన మెహద్ షిహబాను అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన ఆ ముగ్గురి పేర్లు సమీరా, కషీఫ్ శంషుద్దీన్, కిరణ్ గులాం అలీగా పేర్కొన్నారు. వారు మొదట పాక్ నుంచి నేపాల్ చేరుకున్నారని, అనంతరం అక్కడి నుంచి బీహార్ లోని పాట్నా మీదుగా బెంగళూరు వచ్చారని తెలిపారు. అరెస్టయిన కేరళవాసి మెహద్ షిహబా పాకిస్థానీయుల ప్రవేశం గురించి పోలీసులకు వివరిస్తూ.. పాక్ అమ్మాయి ఒక భారతీయుడిని ప్రేమించిందని, వారికి సాయం చేయడానికే పాకిస్థానీయులు ఇక్కడకు వచ్చారని అన్నాడు. ఈ కేసులో నిజానిజాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.