: రోజూ నరకం అనుభవిస్తున్నా... జైలు నుంచి శవంగానే బయటకు వస్తా: ఇళవరసి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, సుధాకరన్ లతో పాటు బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి తీవ్ర ఆవేదనను అనుభవిస్తున్నారు. తన జీవితం ఏంటి ఇలా అయిందంటూ ఆమె కంటతడి పెట్టుకుంటున్నారు. తాను ఏ తప్పూ చేయనప్పటికీ జైల్లో నరకం అనుభవిస్తున్నానని... శవంగానే జైలు నుంచి బయటకు వస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను చూసేందుకు కుమారుడు వివేక్, ఇతర బంధువులు జైలుకు వచ్చినప్పుడల్లా ఆమె కన్నీరుమున్నీరవుతున్నారట. తన దారుణ స్థితిని చెప్పుకుని విలపిస్తున్నారట.
అసలు తన చుట్టూ ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ ఆవేదనలో బీపీ అమాంతం పెరిగిపోయి రెండు సార్లు ఆమె స్పృహ కోల్పోయారట. ఈ నేపథ్యంలో ఆమెకు జైల్లో అత్యవసర చికిత్సను అందించారు. అయితే, ఆమెను బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించేందుకు జైళ్ల శాఖ నిరాకరించింది. తనను పరామర్శించేందుకు వస్తున్న వారి పరామర్శలతో శశికళ కొంత ఊరట చెందుతున్నా... ఇళవరసి మాత్రం జీవితం మీద విరక్తి చెందినట్టుగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.