: కేసీఆర్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు!: కిషన్ రెడ్డి
తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాష ఆక్షేపణీయమని ఆ పార్టీ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని... తెలంగాణకు ఇచ్చిన నిధులను నిరూపిస్తామని... నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ చెప్పిన కేసీఆర్ మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇచ్చినందువల్లే తెలంగాణ ఏర్పడిందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని తెలిపారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేదని అన్నారు. కేసీఆర్ కు ముందుంది మొసళ్ల పండగ అంటూ హెచ్చరించారు.