: లియోనెల్ మెస్సీ జైలు శిక్షను నిలిపిన స్పెయిన్ సుప్రీంకోర్టు
స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి విధించిన 21 నెలల జైలు శిక్షపై స్పెయిన్ సుప్రీంకోర్టు స్టే విధించింది. తన తండ్రి జార్జ్ మెస్సీతో కలసి పన్ను ఎగవేతకు మెస్సీ పాల్పడ్డారన్న అభియోగాలపై విచారించిన కోర్టు ఈ శిక్షతో పాటు 2.2 మిలియన్ డాలర్లను జరిమానాగా విధించిన సంగతి తెలిసిందే. స్పెయిన్ చట్టాల ప్రకారం, తొలిసారి నేరం చేసే వారికి, హింసాత్మక ఘటనలకు పాల్పడని వారికి, రెండేళ్లకు మించి శిక్ష పడని కేసుల్లో సుప్రీంకోర్టు శిక్షను నిలుపుతూ ఆదేశాలు ఇచ్చే వీలుంది. ఈ వెసులుబాటే ఇప్పుడు మెస్సీకి కలిసొచ్చింది.
కాగా, 2007 నుంచి 2009 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 4.6 మిలియన్ డాలర్ల పన్నును వీరు ఎగ్గొట్టడమే కాకుండా, యూకే, స్విట్జర్లాండ్, బ్రెజిల్, ఉరుగ్వే తదితర దేశాల్లోని షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని వీరిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీ, ఐదు సార్లు ప్రపంచకప్ పోటీల్లో పాల్గొని అసంఖ్యాక క్రీడాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు.