: తెలుగుదేశంతో విడిపోతేనే లాభం!: అమిత్ షా వద్ద బీజేపీ నేతల మొర
తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ ఎంతో నష్టపోతోందని ఈ ఉదయం అమిత్ షాను కలిసిన పలువురు బీజేపీ నేతలు తమ అభిప్రాయాన్ని ఆయనకు తెలిపారు. విజయవాడకు వచ్చిన ఆయన్ను కలిసిన బీజేపీ నేతలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తు వ్యవహారాలను చర్చిస్తూ, ఇటీవలి కాలంలో బీజేపీపై తెలుగుదేశం నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
పొత్తు వద్దనుకునే విధంగా వారు మాట్లాడుతున్నారని, పొత్తు కారణంగా బీజేపీతో పోలిస్తే, తెలుగుదేశమే లాభపడిందన్న విషయాన్ని వారు మరచిపోయారని ఫిర్యాదు చేశారు. పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కాగా, అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. కాగా, అమిత్ షాను రాజధాని ప్రాంత రైతులు కూడా కలిశారు. వన్ టైం సెటిల్ మెంట్ గడువును పొడిగించాలని వారు విజ్ఞప్తి చేయగా, అమిత్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.