: నాసిక్ లో దావూద్ ఇబ్రహీం బంధువు వివాహం... క్యూ కట్టిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పోలీసులు!
నాసిక్ లో జరిగిన దావూద్ ఇబ్రహీం బంధువు పెళ్లికి పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు పోలీసు అధికారులు సైతం హాజరు కావడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ, విచారణకు ఆదేశించింది. నాసిక్ మహాత్మా నగర్ ప్రాంతంలోని అప్ స్కేల్ మాల్ లో ఓ యువతి వివాహం జరుగగా, స్థానిక రాజకీయ నేతలతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అతిథులుగా పాల్గొన్నారు. నాసిక్ పాత నగరంలోని భద్రకాళి పోలీస్ స్టేషన్ అధికారులు కూడా హజరయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ విచారణకు ఆదేశించారు.
"ఈ పెళ్లికి పలువురు పోలీసు అధికారులతో పాటు ఎంఎల్ఏలు, కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. వారిలో కొంతమంది హాజరయ్యారు. ఎంతమంది పెళ్లికి వెళ్లారన్న విషయమై విచారిస్తున్నాం. రెండు రోజుల్లో విచారణ పూర్తి అవుతుంది. పెళ్లికి హాజరైన వారిలో కొంతమంది పోలీసులు సెలవులో వెళ్లారు" అని చెప్పారు సింఘాల్. కాగా, ఏసీపీ ర్యాంకు అధికారి ఒకరు పెళ్లికి వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.