: వాట్స్ యాప్ లో టైపింగ్ లో దొర్లిన చిన్న మిస్టేక్ ఎంత పని చేసిందో చూడండి!
వాట్స్ యాప్ లో మెసేజ్ చేస్తుండగా దొర్లిన స్పెల్లింగ్ మిస్టేక్ ఆరుగురు కేరళ ముస్లిం విద్యార్థుల ఇబ్బందులకు కారణమైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... కేరళకు చెందిన ఆరుగురు విద్యార్థులు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో దిగారు. వారిలో ఒక విద్యార్థి తన స్నేహితుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వాట్స్ యాప్ లో 'బాంబే'కి బదులుగా 'బాంబ్' అని టైప్ చేశాడు. దీనిని ట్రాప్ చేసిన రైల్వే పోలీసులు వెంటనే ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని రైల్వే పోలీసులతో పాటు, యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం వేర్వేరుగా విచారించాయి. ఈ సందర్భంగా వారి లగేజీని తనిఖీ చేయగా వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. అనంతరం వారు ఎక్కడికి వెళ్తున్నారని ఆరాతీయగా ఉర్దూ నేర్చుకునేందుకు అని సమాధానం చెప్పడంతో...వారు నేర్చుకోవాలనుకుంటున్న సంస్థకు ఫోన్ చేసి ఆరాతీయగా, అది వాస్తవమేనని తెలిపారు. దీంతో వారిని పోలీసులు విడిచిపెట్టారు.