: అమిత్ షాజీ! దమ్ముందా.. అయితే రండి .... మోదీజీ! ఈ విషయం రాసిపెట్టుకోండి!: అసదుద్దీన్ ఒవైసీ సవాల్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. హైదరాబాదులోని తలాబ్ కట్టలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అమిత్ షా తెలంగాణకు వచ్చి వారినో, లేక వీరినో రెచ్చగొట్టడం ఎందుకు? నేరుగా షా వచ్చి తనతో పోటీ చేయాలని సూచించారు. దమ్ముంటే తనతో పోటీకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
"తెలంగాణకు అమిత్ షా వచ్చారు. సంతోషం, ఆయనకు ఇంత అకస్మాత్తుగా తెలంగాణపై ప్రేమ పుట్టడం ఆనందకరమే. నేను చాలా సార్లు ముఖ్యమంత్రికి చెప్పాను... చూడండి ఆయన వస్తున్నారు, కొత్త కుట్రలు చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చాలా సార్లు చెప్పాను. తెలంగాణకు వచ్చారు సంతోషం. ఎలాగూ ఇక్కడి వరకు వచ్చారు... నేను చాలా సార్లు చెబుతున్నాను...షా సాబ్! హైదరాబాదులో నాపై అభ్యర్థి కోసం వెతుకులాట ఎందుకు?... ఎవరో ఎందుకు, మీరే రండి... మీరు.. నేను ఎదురుబొదురుగా పోటీ పడదాం... తరువాత ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఎవరినో ఎందుకు ఓడించేందుకు తయారు చేస్తారు...నేను సిద్ధంగానే ఉన్నాను... మీరే రండి పోటీ పడదాం.
హైదరాబాదును గెలుచుకుంటాం, గెలుచుకుంటాం అని చెబుతున్నారు... ఇదేమన్నా తినే కేకా...తినేసి నోరు తుడుచుకుందామనుకుంటున్నారు?... ఎన్నో ఏళ్లగా కష్టపడ్డాం. ప్రధాని నరేంద్ర మోదీ గారూ! అమిత్ షాతో పాటు మీరు కూడా రాసిపెట్టుకోండి...సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో మిమ్మల్ని ఓడించి చూపిస్తాం. గోషామహల్ సీటు డిపాజిట్ గల్లంతు చేస్తాం. అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఉప్పల్ లో కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాం" అని ఆయన సవాలు విసిరారు. ఈ సమయంలో సభకు హాజరైన వారు కేరింతలు కొట్టారు.