: ఒకే విమానంలో విజయవాడకు చంద్రబాబు, అమిత్ షా, వెంకయ్య... ముందే చేరుకున్న సురేష్ ప్రభు
నిన్నటి వరకూ తెలంగాణలో ఉన్న జాతీయ నేతలంతా నేడు ఏపీకి కదిలారు. తెలంగాణలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, హైదరాబాదులోనే వున్న వెంకయ్యనాయుడు, హైదరాబాద్ లో జరిగిన మినీ మహానాడుకు వచ్చిన చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి తదితర ప్రముఖులు కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు.
నేటి సాయంత్రం బీజేపీ బూత్ లెవల్ కమిటీల నేతలతో అమిత్ షా సమావేశం కానుండగా, దీనికి మరో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయనకు మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ లు స్వాగతం పలికారు. వీరంతా ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేతలతో బయలుదేరిన ప్రత్యేక విమానం ల్యాండింగ్ కోసం వేచి చూస్తున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం అమిత్ షా గౌరవార్థం చంద్రబాబునాయుడు ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.