: కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విరుచుకుపడితే.. టీఆర్ఎస్ చీఫ్‌ను పల్లెత్తు మాటనని చంద్రబాబు!


హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒక్క విమర్శా చేయకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి భిన్నంగా చంద్రబాబు మాట్లాడడం రాజకీయాల్లో చర్చకు కారణమైంది. రేవంత్‌రెడ్డి ప్రతిరోజు టీఆర్ఎస్‌పైనా, కేసీఆర్‌పైనా నిప్పులు చెరుగుతూనే  ఉన్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అటు టీఆర్ఎస్‌ను కానీ, కేసీఆర్‌ను కానీ  పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం.

 మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ 1982లో హైదరాబాద్‌లోనే పురుడు పోసుకుందని, తెలంగాణ నుంచి దానిని ఎవరూ తుడిచేయలేరని అన్నారు. చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై ఎన్నికల సమయంలోనే మాట్లాడదామని, ఆ విషయంలో ఇప్పుడు ఎటువంటి కామెంట్లు చేయవద్దని సూచించారు. పొత్తు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందని, ఈలోపు చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ఎవరూ అలక్ష్యం చేయవద్దని సూచించారు. తనకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు సమానమేనని, రెండూ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రజా సమస్యలపై మాత్రం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News