: మీతో గంట నుంచి మాట్లాడుతున్నా కనపడడం లేదా? ఆరోగ్యంగానే ఉన్నా!: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలుసార్లు వైద్య చికిత్స తీసుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఈ రోజు విలేకరులు ప్రశ్నించారు. దానికి కేసీఆర్ సమాధానం చెబుతూ.. మీతో గంట నుంచి మాట్లాడుతున్నా కనపడడం లేదా? ఆరోగ్యంగానే ఉన్నా.. అని అన్నారు. చికిత్స తీసుకుంటూనే ఉన్నాను.. బానే ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా తాను త్వరలోనే మూడు నాలుగు రోజులు టీవీ ఛానెళ్లలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తానని, తెలంగాణలో జరుగుతున్న పనుల గురించి వివరిస్తానని తెలిపారు.
ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తామన్న అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ అన్నారు. తమ పార్టీ నేతలతో చర్చించి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై సమష్టిగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తనకు ప్రధాని మోదీ అంటే గౌరవం ఉందని, కేంద్రంతో వైరం లేదని అన్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో మోదీకి మొదటి సారి మద్దతు తెలిపింది తానేనని అన్నారు.
కేంద్రంతో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామని అన్నారు. అయితే, తెలంగాణను నిందించే వారు ఎవరైనా తమకు శత్రువులేనని అన్నారు. అమిత్ షా అనవసరంగా ఇక్కడకు వచ్చి ఏవో వ్యాఖ్యలు చేసి వెళ్లిపోతున్నారని అన్నారు. తాను చేయించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు. తెలంగాణను కించపర్చే ప్రయత్నం ఈ ప్రపంచంలో ఎవ్వరు చేసినా తాము క్షమించబోమని చెప్పారు.