: తెలంగాణ రాష్ట్రం ఏదో మీ భిక్ష మీద బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు: కేసీఆర్
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడకు వచ్చి తెలంగాణ ఏదో వారి భిక్ష మీద బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆయన మాట్లాడుతూ... అమిత్ షా ఘోరమైన తప్పు ఒకటి మాట్లాడారని, ప్రతి ఏటా తెలంగాణకు అదనంగా 20 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు పలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
‘అమిత్ షాకి నేను చాలెంజ్ చేస్తున్నాను.. అదనంగా 200 కోట్లయినా ఇచ్చారా? ఇస్తే చెప్పండి’ అని కేసీఆర్ అన్నారు. గౌరవం ఇస్తే గౌరవం పుచ్చుకుంటారని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతే ఒక ముఖ్యమంత్రిగా నేనెలా ఊరుకుంటా? అని అన్నారు. కేంద్రానికి పన్నుల కింద తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు చెల్లించుకుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 63,790 మాత్రమే ఇచ్చిందని వివరించారు. కేంద్ర పన్నుల్లో వాటాల కింద ఈ మూడు ఏళ్లలో రాష్ట్రానికి 37,773 కోట్లు వచ్చాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల రూపంలో తెలంగాణకు రూ.18,574 కోట్లు వచ్చాయని కేసీఆర్ అన్నారు. జాతీయ రహదారుల కింద ఇప్పటివరకు రాష్ట్రానికి 2,055 కోట్లు మంజూరు అయ్యాయని, వీటిని కేంద్రమే ఖర్చు పెడుతుందని అన్నారు. విభజన చట్టం కింద రూ.1,016 కోట్లు మాత్రమే రెండు వాయిదాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందని, ఏపీకి మాత్రం ఇప్పటికి మూడుసార్లు ఇచ్చిందని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ 5,160 కోట్లు వచ్చాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రూ.1,200 కోట్ల పైచిలుకు సీఎస్‌టీ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు.