: నన్ను తిట్టినా ఊరుకుంటా... తెలంగాణను ఏమైనా అంటే మాత్రం ఊరుకోను: అమిత్ షాపై మండిపడ్డ కేసీఆర్
తెలంగాణలో పర్యటిస్తోన్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన పలు వ్యాఖ్యలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ... గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారని, తెలంగాణకు రూ.95 వేల కోట్లు ఇచ్చినట్లు అప్పట్లో అన్నారని చెప్పారు. ఇప్పుడు కూడా అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకోకుండా, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారని అన్నారు. అమిత్ షా ఈ సారి కూడా అద్భుతమైనటువంటి అబద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు.
దేశాన్ని పరిపాలించే పార్టీకి అధ్యక్షుడైన అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ పార్టీ అయినా తెలంగాణలో బలం పెంచుకోవచ్చని, అయితే, అసత్య ప్రచారం చేయకూడదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచిచెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారని హితవు పలికారు. వాస్తవాలు ఏంటో జనాలకి తెలుసని అన్నారు. అమిత్ షా ఈ సారి తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని వ్యాఖ్యలు చేశారని, దీనికి బీజేపీ, అమిత్ షా సమాధానం చెప్పాలని అన్నారు. గతంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తాము అంతగా పట్టించుకోలేదని, లైటుగా తీసుకొని వదిలేశామని అన్నారు. మళ్లీ వచ్చి వరుసదాడిలా వ్యాఖ్యలు చేశారని అన్నారు.
దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందని, తెలంగాణ ప్రభుత్వ పాలసీలన్నీ అద్భుతంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసమే తమ కృషి అని అన్నారు. ‘కేసీఆర్ స్వభావం ఏంటో మీకు తెలుసు.. నన్ను వ్యక్తిగతంగా మాటలు అన్నాపడతాను.. తెలంగాణ వ్యవస్థనే కించపరుస్తూ మాట్లాడితే నా ప్రాణం పోయినా ఊరుకోను. మోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. పలు రాష్ట్రాల నేతలు ఇక్కడకు వచ్చి, ఇక్కడి పథకాలను పరిశీలించిపోతున్నారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.