: చలపతిరావు వ్యాఖ్యలపై చర్చా కార్యక్రమం... అసహనంతో ఊగిపోతూ లైవ్ నుంచి నిష్క్రమించిన యాంకర్ రవి!
‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ హీరో అక్కినేని నాగచైతన్య తన కొత్త సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ట్రైలర్ లో చెప్పిన డైలాగు ఎంతో ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇదే డైలాగుపై అభిప్రాయాలు తీసుకుంటున్న యాంకర్.. నటుడు చలపతి రావు వద్దకు వెళ్లి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని అడగగా, పబ్లిగ్గా ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళామణులు భగ్గుమంటున్నారు. చలపతి రావు వెకిలి వ్యాఖ్యలు చేసిన వెంటనే యాంకర్ రవి 'సూపర్ సార్' అనడం పట్ల కూడా మహిళలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై ఈ రోజు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన యాంకర్ రవి.. మహిళలు వేస్తోన్న ప్రశ్నలకు అసహనంతో ఊగిపోతూ లైవ్ నుంచి నిష్క్రమించాడు. అంతకు ముందు ఆయన తాను చేసిన వ్యాఖ్యపై వివరణ ఇచ్చుకొని, సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
చలపతి రావు చేసిన వ్యాఖ్యలు కొన్ని కారణాల వల్ల తనకు సరిగా వినిపించలేదని, కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే తాను సూపర్ అంటూ వ్యాఖ్యానించానని రవి చెప్పాడు. ఆ సమయంలో జనాలు నవ్వడం చూసి చలపతి రావు ఏదో పంచ్ వేశారనుకొని తాను అలా వ్యాఖ్యానించానని చెప్పాడు. సౌండ్ సిస్టం బాగోలేదని తాను ఆ సమయంలో అక్కడి వారికి కూడా చెప్పానని అన్నారు. తాను చెబుతున్న మాటలను కొందరు కవర్ చేసుకుంటున్నాడని అంటున్నారని ఆయన అన్నాడు. ఆడియో లాంఛ్ నిర్వాహకులు చెప్పిన విధంగానే తాము అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అనే ప్రశ్నను అందరినీ అడిగామని అన్నాడు. తాను హోస్ట్ చేస్తున్న 'పటాస్' అనే టీవీ ప్రోగ్రాం ఇప్పుడు 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటోందని, ఆ ప్రోగ్రాంలోకి రావడానికి యూత్ క్యూ కడతారని చెప్పాడు. వ్యక్తిగతంగా తాను ఆడవాళ్లను గౌరవిస్తానని, ఎవరి శరీరాలమీదా కామెంట్లు చేయబోనని తెలిపాడు. న్యూస్ ఛానెళ్లు ఈ అంశాన్ని పెద్దవి చేసి చూపిస్తున్నాయని తెలిపాడు.