: పాకిస్థాన్ మీడియా వ్యాఖ్యలను ఖండించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సియాచిన్ గ్లేసియర్ కు సమీపంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయంటూ పాక్ మీడియాలో వచ్చిన వార్తలను భారతీయ వాయుసేన ఖండించింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా పాక్ కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు సియాచిన్ గ్లేసియర్ కు సమీపంలో తిరిగాయనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో ప్రసారమయ్యాయి. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ సొహైల్ అమాన్ పర్యవేక్షణలో ఇదంతా జరిగిందని, స్కర్ద్ ఎయిర్ బేస్ ను ఆయన ఈ రోజు సందర్శించారని మీడియాలో ప్రసారమైంది. సొహైల్ అమాన్ తో పాటు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారని, సొహైల్ అమాన్ స్వయంగా మిరాజ్ జెట్ ఫైటర్ ను నడిపారని సామా టీవీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, పాకిస్థాన్ మీడియా చెప్పినట్టు ‘సియాచిన్’ వద్ద ఎటువంటి ఎయిర్ స్పేస్ ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని అన్నారు.