: గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు: హోం మంత్రి నిమ్మకాయల
రాజకీయ గొడవల్లో 300 మంది హత్యకు గురయ్యారంటూ గవర్నర్ నరసింహన్ కు వైసీపీ అధినేత జగన్ ఫిర్యాదు చేయడం సిగ్గు చేటని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 300 మంది ఎక్కడ చనిపోయారో జగన్ చెప్పాలని సవాల్ విసిరారు. రాజశేఖరరెడ్డి హయాంలోనే రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగాయని ఆయన అన్నారు. అద్దంకి, పత్తికొండల్లో జరిగిన హత్యలు ఫ్యాక్షన్ హత్యలని... వీటికి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. ఫ్యాక్షనిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాదాన్ని పరిష్కరించడంలో సీఐ రామారావు విఫలమయ్యారని... అందుకే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. విశాఖలో జరగనున్న మహానాడు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని... జిల్లాకు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.