: మిత్రుడితో అనుకోని ప్రయాణం... చంద్రబాబు, అమిత్ షాలను కలపనున్న విమానం!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను అనుకోకుండా కలపనుందో విమానం. నేటితో తెలంగాణలో మూడు రోజుల పర్యటనను ముగించుకోనున్న అమిత్ షా, రాత్రికి హైదరాబాద్ లో బస చేసి, రేపు ఉదయం విజయవాడకు విమానంలో వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయనతో పాటు ఆయన వెంట ఉన్నవారికీ టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక నేడు హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడులో పాల్గొనేందుకు సాయంత్రం రానున్న చంద్రబాబు, రాత్రికి ఇక్కడే విశ్రమించి, రేపు ఉదయం విజయవాడకు వెళ్లనున్నారు. కాకతాళీయంగా ఆయన కూడా అమిత్ ప్రయాణించే విమానంలో విజయవాడకు వెళుతున్నారు. స్వతహాగా కూడా ఇద్దరూ మంచి మిత్రులు కావడంతో, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.